
జన నాయగన్ విషయంలో అదొక చేదు వార్త. - పూజా హెగ్డే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముకుంద సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడంతో పాటూ టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి సత్తా చాటుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోతో జోడీ కట్టింది పూజా.
ఆ తర్వాత పూజా వరుస సినిమాలు చేసినప్పటికీ అవి ఫ్లాపులవుతూ వచ్చాయి. ఏం చేసినా కొంత కాలంగా పూజాకు ఏం కలిసి రావడం లేదు. గత మూడేళ్లలో తెలుగులో పూజా నుంచి ఒక్క సినిమా కూడా వచ్చింది లేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన పూజా నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం ఆమె ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.
తెలుగులో చేయకపోయినా తమిళంలో మాత్రం పూజా వరుస సినిమాలను లైన్ లో పెట్టి వాటిని చేసుకుంటూ వెళ్తుంది. అందులో భాగంగానే పూజా రీసెంట్ గా సూర్య హీరోగా వచ్చిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా నటించింది. రెట్రోలో హీరోయిన్ గా నటించడమే కాకుండా ఆ సినిమా ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మరీ చేసింది పూజా. కానీ రెట్రో సినిమా కూడా ఫ్లాపుగానే మిగిలింది. దీంతో ప్రస్తుతం తన ఆశలన్నీ దళపతి విజయ్ తో చేస్తున్న జననాయగన్ పైనే పెట్టుకుంది. ఆల్రెడీ వీరిద్దరూ కలిసి బీస్ట్ సినిమాలో నటించారు. బీస్ట్ మూవీ ఆడియో పరంగా ఆడియన్స్ ను మెప్పించింది. కానీ ఆ సినిమా ఫ్లాపే. బీస్ట్ తర్వాత ఇప్పుడు మరోసారి విజయ్ తో కలిసి పూజా హెగ్డే స్క్రీన్ ను షేర్ చేసుకోబోతుంది. జననాయగన్ లో విజయ్ తో కలిసి నటించడంపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా మాట్లాడింది.
జన నాయగన్ సినిమాలో విజయ్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన పూజా, విజయ్ అద్భుతమైన యాక్టర్ అని చెప్పింది. అయితే విజయ్ తో తాను చేస్తున్న జన నాయగన్ సినిమానే అతని ఆఖరి సినిమా కావడం బాధాకరంగా ఉందని, తన దృష్టిలో అదొక చేదు వార్త అని పేర్కొంది. తనతో పాటూ ఎంతోమంది ఫ్యాన్స్ విజయ్ సినిమాలను ఇష్టపడతారని, ఆయన సినిమాల కోసం ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయని పూజా తెలిపింది. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవుతున్న కారణంగా ఇకపై సినిమాలు చేయకూడదని డిసైడ్ అయి, అందులో భాగంగానే జన నాయగన్ ను ఆఖరి సినిమాగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.