ఆకట్టుకున్న విజయ్ ఆంటోని "మార్గన్" !
ఆకట్టుకున్న విజయ్ ఆంటోని "మార్గన్" !

ఎప్పుడో దశాబ్దం క్రితం వచ్చిన బిచ్చగాడుతోనే ఇంకా మార్కెట్ ని కాపాడుకుంటూ వస్తున్న హీరో విజయ్ ఆంటోనీ..ఆ తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ గత రెండు మూడేళ్ళలో కనీసం థియేటర్ రిలీజ్ అయిన సంగతి కూడా తెలియక ముందే మాయమైపోయినవి ఎక్కువగా ఉంటాయి. ఖూనీ, తుఫాన్ లాంటి పేర్లు సగటు మూవీ లవర్స్ కూడా విని ఉండరు. కన్నప్పతో పాటుగా ఒకే రోజు రిలీజైన మార్గన్ కూడా అదే కోవలోకి చేరుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా దీనికి డీసెంట్ టాక్ వినిపిస్తోంది. కంటెంట్ జనానికి చేరేలా కనిపిస్తోంది.

కథ పరంగా చూస్తే పైకి మాములు క్రైమ్ థ్రిల్లర్ లాగే అనిపిస్తుంది. సిటీలో అమ్మాయిలను ఒక సైకో కిల్లర్ ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేస్తుంటాడు. దాని వల్ల వాళ్ళ శరీరాలు నల్లగా మారిపోతాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ధృవ్ (విజయ్ ఆంటోనీ)  కూతురు సైతం ఇదే తరహాలో చనిపోయి ఉంటుంది. దీంతో డ్యూటీలో లేకపోయినా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న ధృవ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. మొదటి అనుమానం అరవింద్ (అజయ్ దిశన్) అనే కుర్రాడి మీదకు వెళ్తుంది. కానీ అనూహ్య పరిణామాల తర్వాత అసలు హంతకుడు ఎవరో తెలిశాక షాక్ తినడం మన వంతవుతుంది.

దర్శకుడు లియో జాన్ పాల్ స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు. మరీ ఎక్స్ ట్రాడినరి అనలేం కానీ విసుగు రాకుండా కథనం నడిపించడంలో సక్సెసయ్యాడు. ముఖ్యంగా సస్పెన్స్ మైంటైన్ చేసిన విధానం, విలన్ ఎవరూ గెస్ చేయనివ్వకుండా డైవర్ట్ చేసిన తీరు బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ని సాగదీసిన తీరు ల్యాగ్ కు దారి తీసింది. సెకండాఫ్ లో స్పీడ్ కొంచెం తగ్గుతుంది. విజయ్ ఆంటోనీ కన్నా ఎక్కువగా అజయ్ దిశన్ స్క్రీన్ ని డామినేట్ చేశాడు. రెగ్యులర్ గా క్రైమ్ మూవీస్ చూసే వాళ్లకు మార్గన్ మంచి ఛాయసే అవుతుంది కానీ మరీ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు రేంజ్ లో అంచనాలు పెట్టుకోకుంటే చాలు. హీరోనే ఇచ్చిన బిజిఎం బాగుంది.